Chintha Mohan: జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందే: చింతా మోహన్
- బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారు
- అవినీతి కేసుల్లో నిందితులైన అధికారులకు కీలక పోస్టులు ఇచ్చారు
- జగన్ విషయంలో కోర్టులు ఎందుకు కలగజేసుకోవడం లేదు?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. తన అవినీతి ఆరోపణల కేసుల్లో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మీ సహా పలువురు ఐఏఎస్ అధికారులకు జగన్ కీలక పోస్టులు ఇచ్చారని... కీలక శాఖల బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. సాక్షులను తన అధికారంతో జగన్ ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తుంటే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. కోర్టులకు కళ్లు లేవా? అని అడిగారు.
ప్రజలు కూడా న్యాయస్థానాల చిత్తశుద్ధిని శంకిస్తున్నారని చింతామోహన్ అన్నారు. లక్ష రూపాయలు తీసుకున్నారనే కేసులో దళితనేత బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపారని... వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ విషయంలో కోర్టులు కళ్లు మూసుకున్నాయని చెప్పారు. జగన్ కు ఒక న్యాయం, బంగారు లక్ష్మణ్ కు మరో న్యాయమా? అని అసహనం వ్యక్తం చేశారు.
తిరుపతి ఉప ఎన్నికలో బయటి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వారు కరోనా బారిన పడ్డారని చింతామోహన్ అన్నారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసి, కరోనాకు గురై ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు.