Maharashtra: కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సంజయ్ రౌత్
- కరోనా జాతీయ విపత్తు అని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది
- ఉద్ధవ్ థాకరే ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు
- కరోనా నియంత్రణకు మేము అనుసరిస్తోన్న విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి
దేశంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి ఊహించని స్థాయిలో పెరిగిపోతోన్న నేపథ్యంలో కొవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. 'కరోనా ఓ జాతీయ విపత్తు అని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇప్పటికే పలుసార్లు కోరారు' అని సంజయ్ రౌత్ చెప్పారు.
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశాలు జరిపినప్పుడు కూడా ఈ విషయాన్ని ఉద్ధవ్ థాకరే లేవనెత్తారని ఆయన తెలిపారు. కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయని చెప్పారు.
మహారాష్ట్రలో కరోనా నియంత్రణకు అనుసరిస్తోన్న విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఆ రాష్ట్రంలో ఏకంగా 63,309 కొత్త కేసులు నమోదయ్యాయి.