CDC: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే ప్రధాన ప్రయోజనం ఇదే: అమెరికా సీడీసీ
- అమెరికాలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్
- టీకా తీసుకుంటే ఆసుపత్రిలో చేరే ముప్పు ఉండదన్న సీడీసీ
- రెండు డోసులు తీసుకుంటే 94 శాతం రక్షణ
- ఒక డోసు తీసుకుంటే 64 శాతం రక్షణ
- బ్రిటన్, ఇజ్రాయెల్ లోనూ ఇదే తరహా ఫలితాలు
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆసక్తికర వివరాలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే, పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదని సీడీసీ స్పష్టం చేసింది. మరణం నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. 65 ఏళ్లకు పైబడిన వారు రెండు డోసులు తీసుకున్న అనంతరం, వారికి 94 శాతం రక్షణ కలుగుతుందని వివరించింది. ఒక డోసు తీసుకుంటే 64 శాతం రక్షణ కలుగుతుందని వెల్లడించింది. టీకా తీసుకున్న వారు కరోనా వైరస్ ను సాధారణ జలుబులాగానే ఎదుర్కొంటారని సీడీసీ పేర్కొంది.
ఈ అధ్యయనం కోసం సీడీసీ నిపుణులు అమెరికాలోని 417 మంది కరోనా రోగుల సమాచారాన్ని, 187 మంది వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ఆరోగ్యపరిస్థితితో పోల్చి చూశారు. అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. సీడీసీ తాజా అధ్యయనంతో ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై మరింత సానుకూలత బలపడింది. దీనిపై సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్ స్కై స్పందిస్తూ.... వ్యాక్సినేషన్ వల్ల కరోనా రోగులు ఆసుపత్రుల పాలయ్యే ముప్పు తప్పుతుందని, తద్వారా ఆసుపత్రులు నిండిపోయే అవకాశం ఉండదని వివరించారు. ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
అటు, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అధ్యయనం చేపట్టాయి. ఇజ్రాయెల్ లో వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తేలింది. అటు, బ్రిటన్ లో కరోనా టీకా ఒక డోసు వేసుకున్నా 50 శాతం రక్షణ కలిగిస్తున్నట్టు గుర్తించారు.