Peddireddi Ramachandra Reddy: శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు గట్టి చర్యలు తీసుకోండి: పెద్దిరెడ్డి
- గ్రామాల్లో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలి
- తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
- వైయస్సార్ జలకళ పనులను వేగవంతం చేయండి
కరోనా కేసులు ఎక్కువవుతున్న తరుణంలో గ్రామాల్లో ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అన్నారు. వీటన్నిటికీ అవసరమైన నిధులను కూడా కేటాయించామని చెప్పారు. గ్రామాల్లో రూ. 1,486 కోట్ల ఖర్చుతో చేపట్టిన 1,944 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వైయస్సార్ జలకళ పథకం కింద బోర్ వెల్ డ్రిల్లింగ్ కు రూ. 2,340 కోట్లు, పంపుసెట్లకు రూ. 1,875 కోట్లు, విద్యుత్ పరికరాలకు రూ. 1,500 కోట్ల అంచనాలతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలో అధికారులతో ఈరోజు పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పైమేరకు ఆదేశించారు.