Delhi Capital: పృథ్వీషా వీరబాదుడు.. కోల్‌కతాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ

Delhi Capitals Won by 7 Wickets On Kolkata Knight Riders

  • 82 పరుగులు చేసిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీషాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
  • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పంత్ సేన
  • కొనసాగుతున్న కోల్‌కతా పరాజయాల పరంపర

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 155 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పృథ్వీషా మెరుపులకు తోడు శిఖర్ ధవన్ నిలకడైన ఆటతీరుతో ఢిల్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

41 బంతులు మాత్రమే ఆడిన షా.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. యువ బౌలర్ శివం మావి వేసిన ఓ ఓవర్‌లో వరుసగా ఆరు బంతులనూ బౌండరీకి తరలించాడు. అతడి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. శిఖర్ ధవన్ 46 పరుగులు, పంత్ 16 పరుగులు చేశారు. బౌలర్లకు చుక్కలు చూపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పృథ్వీషాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఐదింటిలో గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చివర్లో రస్సెల్ మెరుపులు మెరిపించడంతో ఆమాత్రం స్కోరైనా సాధించగలిగింది. 27 బంతులు మాత్రమే ఆడిన రస్సెల్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  శుభ్‌మన్ గిల్ 43, నితీశ్ రాణా 15, త్రిపాఠి19, కార్తీక్ 14, కమిన్స్ 11(నాటౌట్) పరుగులు చేశారు. కెప్టెన్ మోర్గాన్, నరైన్‌లు డకౌట్ అయ్యారు. ఐపీఎల్‌లో కోల్‌కతాకు ఇది ఐదో పరాజయం. నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News