Cowin: మే 16 వరకూ స్లాట్లు నిల్... కొవిన్ వెబ్ సైట్ సమాచారం!
- బుధవారం సాయంత్రం మొదలైన రిజిస్ట్రేషన్లు
- గురువారం నాటికే స్లాట్లన్నీ ఫుల్
- ఎప్పుడు టీకా అందుతుందోనని ప్రజల ఆందోళన
రేపటి నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని, అందుకుగాను రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది కేంద్రం. కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అయితే, 16వ తేదీ వరకూ స్లాట్లు ఖాళీ లేవని కొవిన్ చూపుతోంది. వాస్తవానికి కొవిన్ యాప్ లో పిన్ కోడ్ నంబర్, ఆధారంగా వ్యాక్సిన్ కేంద్రాలు కనిపిస్తాయి. ఎన్నో నగరాల పరిధిలో పిన్ కోడ్లు టైప్ చేస్తే, తదుపరి రెండు వారాల వరకూ స్లాట్ లేదన్న సమాచారం కనిపిస్తోంది.
బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించినా, సాయంత్రం నాలుగు గంటల తరువాతనే వెబ్ సైట్ తెరచుకుంది. ఒక్కసారిగా లక్షలాది మంది వెబ్ సైట్ ను తెరవడంతో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆపై రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, గంటల వ్యవధిలో కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక, గురువారం నాడు స్లాట్లు ఖాళీ లేవన్న సమాచారం మాత్రమే వెబ్ సైట్ లో కనిపించింది.
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఇవ్వడానికే సరిపడినంత టీకాలు లేవు. ఈ పరిస్థితుల్లో 18 ఏళ్లు దాటిన వారికి ఎంతమాత్రం టీకాలు వేస్తారన్న విషయమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో వ్యాక్సిన్లు వేస్తున్న హాస్పిటల్స్, పీహెచ్సీల్లో రోజుకు 100 నుంచి 200 వరకూ స్లాట్లు కేటాయించగా, అవన్నీ నిండిపోయాయని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ జిల్లాల్లో ఇప్పటికి 15.30 లక్షల మందికి ఇప్పటివరకూ టీకాలు అందించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు సగానికి పైగా కేంద్రాల్లో ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఇవ్వడం లేదు. టీకా వయల్స్ వచ్చినా, 50 నుంచి 80 మందికి మాత్రమే వేస్తున్నారు. టీకా కోసం క్యూలో నిలబడిన వారు నిరాశతో వెనక్కు వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలన్న విషయమై సందిగ్ధత నెలకొంది.