Supreme Court: సోషల్​ మీడియాలో పౌరులు కరోనా బాధలు చెప్పుకుంటే తప్పా?: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

No Clampdown On Info in Social Media Supreme court Warns
  • బాధలు చెప్పుకున్న వారిని హింసించొద్దన్న కోర్టు
  • అలా చేస్తే కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణిస్తామని హెచ్చరిక
  • ఆక్సిజన్, మందుల కొరతను ఇతరులతో పంచుకోవద్దా? అని ప్రశ్న
  • దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన
  • డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకట్లేవని కామెంట్
సోషల్ మీడియాలో కరోనా బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటూ ఇతరులకు సమాచారం చేరవేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవద్దని, ఒకవేళ అలా చేస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో బాధలు చెప్పుకోవడాన్ని అణచివేయడం తగదని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు.

ఓ పౌరుడిగా, న్యాయమూర్తిగా అది తనకు ఎంతో ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తమకు బెడ్లు కావాలనో లేదంటే ఆక్సిజన్ కొరత ఉందనో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేరం కాదని, అలా తమ గోడు వెళ్లబోసుకున్న పౌరులను హింసిస్తే కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పౌరులు సోషల్ మీడియాలో లేవనెత్తిన బాధలు తప్పు అని అనుకోవడం తగదన్నారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే హోటళ్లు, ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలను కొవిడ్ సేవల కోసం ఉపయోగించుకోవచ్చని సూచించారు. వ్యాక్సిన్లపైనా కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారు. ఇలాంటి తరుణంలోనూ కేంద్ర ప్రభుత్వమే ఎందుకు పూర్తిగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు ధరలు ఎందుకని నిలదీశారు.

రాష్ట్రాలు 50 శాతం డోసులను కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇందులో సమానత్వం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నోళ్లు 59 కోట్ల మంది ఉన్నారని, పేద ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే ఇప్పుడూ అనుసరించాలని ప్రభుత్వానికి సూచించారు.
Supreme Court
COVID19
Social Media

More Telugu News