KA Paul: పనికిమాలిన విద్యాశాఖ మంత్రి మాటను జగన్ వినొద్దు: కేఏ పాల్
- పరీక్షలను వాయిదా వేసేంత వరకు నా దీక్ష కొనసాగుతుంది
- జగన్ కు, విద్యామంత్రికి మతి లేదా?
- విద్యా మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మతప్రబోధకుడు కేఏ పాల్ నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు, విద్యా మంత్రికి మతి లేదా? అని ప్రశ్నించారు.
పనికిమాలిన విద్యాశాఖ మంత్రి మాటను జగన్ వినొద్దని కేఏ పాల్ అన్నారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖరరెడ్డి బతికుంటే తాను చేస్తున్న దీక్షకు ఇక్కడకు వచ్చి ఉండేవారని చెప్పారు. జగన్ ఆయన సొంత కూతుర్లను పరీక్షలు రాయడానికి కొవిడ్ హాల్లోకి పంపిస్తారా? అని ప్రశ్నించారు. వచ్చే నెల 5 నుంచి జరిగే పరీక్షలు వాయిదా పడతాయనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. పరీక్షలను వాయిదా వేసేంత వరకు తన ఆమరణదీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేసినా, చంపినా భయపడబోనని చెప్పారు.