YV Subba Reddy: కరోనా కారణంగా టీటీడీ ఉద్యోగులు 15 మంది చనిపోయారు: వైవీ సుబ్బారెడ్డి
- తిరుమలలో విధుల వల్ల వీరు కరోనా బారిన పడలేదు
- తిరుపతిలో నివాసం ఉంటూ కరోనా బారిన పడ్డారు
- కరోనా సోకిన వారికి బర్డ్ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తాం
తిరుమల కొండపై పని చేస్తున్న పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత కూడా పడ్డారు. కరోనా కారణంగా 15 మంది ఉద్యోగులు మృతి చెందారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్నందువల్ల వీరు కరోనా బారిన పడలేదని... ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుంటారని, అక్కడే వీరు కరోనా బారిన పడ్డారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తామని చెప్పారు.
గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యంతో శ్రీవారికి నైవేద్యం సమర్పించాలనే నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. స్వామి వారి దర్శనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులను బలవంతంగా ఆపలేమని తెలిపారు.