ISB: జూలై వరకు దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కటకట తప్పదు: ఐఎస్ బీ
- భారత్ లో ముమ్మరంగా వ్యాక్సినేషన్
- వ్యాక్సిన్ నిల్వలు సరిపోవంటున్న ఐఎస్ బీ
- నీతి ఆయోగ్ కు నివేదిక సమర్పణ
- రాష్ట్రాల వద్ద ఉన్నది 1.3 కోట్ల డోసులేనని వెల్లడి
- ఇప్పటివరకు 15 కోట్ల డోసులు వేశారని వివరణ
భారత్ జనాభా 130 కోట్లు కాగా, ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 15 కోట్లే! ఓవైపు కరోనా మహమ్మారి సుడిగాలి వేగంతో వ్యాప్తి చెందుతుండడంతో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అంటూ కేంద్రం ప్రకటించడం తెలిసిందే. కానీ అందుకు తగ్గ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
దీనిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) స్పందించింది. జూలై వరకు భారత్ లో కరోనా వ్యాక్సిన్ల కొరత తప్పదని పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటించినా, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ నిల్వలు అందుకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది.
ఇటీవలే నీతి ఆయోగ్ కు సమర్పించిన నివేదికలో ఐఎస్ బీ ఈ మేరకు వెల్లడించింది. ఈ నివేదిక రూపకల్పనలో ఐఎస్ బీ ప్రొఫెసర్ సారంగ్ దేవ్, ప్రొఫెసర్ శ్రీపాద్ దేవాల్కర్, రీసెర్చ్ అసోసియేట్లు అభిషేక్ రెడ్డి, సయ్యద్ జునైద్ ముఖ్యపాత్ర పోషించారు. జూలై చివరి వరకు అనేక రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటాయని ఐఎస్ బీ తన నివేదికలో వివరించింది.
ఏప్రిల్ 29 నాటికి 15 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించగా, 1.3 కోట్ల డోసులే మిగిలున్నాయని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాధారణంగా ఉన్న సమయంలో రాష్ట్రాల వద్ద నిల్వలు గణనీయస్థాయిలోనే ఉన్నాయని, కానీ వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో రాష్ట్రాల వద్ద నిల్వలు తరిగిపోయాయని వివరించింది.
కాగా, 18 ఏళ్లు నిండినవారికి కూడా కరోనా వ్యాక్సిన్ అంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అనేక రాష్ట్రాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రెండో డోసు ఇవ్వాల్సి ఉండగా, ఉన్న నిల్వలు అందుకు సరిపోతాయని, కొత్తగా తొలి డోసులు ఇవ్వాలంటే మరిన్ని వ్యాక్సిన్ డోసులు కావాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.