AIIMS: రెండో డోసు ఆలస్యమైనా ఆందోళన వద్దు: ఎయిమ్స్ చీఫ్
- ఆలస్యమైనా వేయించుకోవాలన్న డాక్టర్ గులేరియా
- రెండో డోసు బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని స్పష్టీకరణ
- ‘బ్రేక్ ద చైన్’ ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచన
కరోనా రెండో డోసు తీసుకోవడం కొన్ని వారాలు ఆలస్యమైతే పనిచేయదన్న అపోహలు వద్దని, ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఆలస్యమైనంత మాత్రాన రెండో డోసు వేసుకోవడానికి జంకవద్దని, ఆలస్యమైనా అది పనిచేస్తుందన్నారు. కరోనా బారినపడి కోలుకున్న వారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతుండగా, వైద్య నిపుణులు మాత్రం లక్షణాలన్నీ తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ గులేరియా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.
కరోనా మొదటి దశలో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఎప్పుడు ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలను పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరుచుకోవడం ద్వారా కేసులను తగ్గించుకోవచ్చన్నారు. ఇందుకోసం ‘బ్రేక్ ద చైన్’ ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచించారు.