America: గతేడాది కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. తాజాగా దారుణ విషయం వెలుగులోకి
- గతేడాది ఆగస్టులో భారీ కార్చిచ్చు
- 3.62 లక్షల ఎకరాల బూడిద
- 5 లక్షల మంది నిరాశ్రయులు
- ప్రియురాలిని హత్య చేసి బయటపడకుండా అడవికి నిప్పు
- నిందితుడి అరెస్ట్
అమెరికాలోని కాలిఫోర్నియాలో గతేడాది ఆగస్టులో భారీ దావానలం చెలరేగింది. ఈ కార్చిచ్చు కారణంగా భారీ నష్టం సంభవించింది. వందలాది భవనాలు మాడిమసైపోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఏకరాల్లో అడవి నాశనమైంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు దర్యాప్తు చేపట్టిన అధికారులను తాజాగా బయటపడిన ఓ నిజం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ మహిళను హత్య చేసి దానిని దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నంలోనే అడవి తగలబడినట్టు గుర్తించి షాకయ్యారు.
అగ్ని ప్రమాదానికి ముందు విక్టర్ సెరింటినో అనే వ్యక్తితో 32 ఏళ్ల ప్రిసిల్లా కాస్ట్రో డేటింగ్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో కానీ ప్రిసిల్లాను విక్టర్ హత్య చేశాడు. అయితే, విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు అడవికి నిప్పు పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తాజాగా నిందితుడు విక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కాగా, సోలానో కౌంటీలో మొదలైన మంటలు క్రమంగా విస్తరించి దాదాపు 3.62 లక్షల ఎకరాలను బూడిద చేశాయి. ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.