GHMC: పార్కింగ్ నిబంధనల ఉల్లంఘన.. రూ. 50 వేలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
- పార్కింగ్ ఫీజులను వసూలు చేసిన కాంప్లెక్స్ లపై ఉక్కుపాదం
- బాధితుల ఫిర్యాదులకు స్పందించిన జీహెచ్ఎంసీ
- రెండు సంస్థలకు రూ. 50 వేల చొప్పున వడ్డన
పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ, నిబంధనలను అతిక్రమిస్తున్నవారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలను అతిక్రమిస్తూ పార్కింగ్ ఫీజు వసూలు చేసిన రెండు సంస్థలకు భారీ వడ్డన విధించింది. రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే, అమీర్ పేట లోని పావని ప్రెస్టీజ్ కాంప్లెక్స్ లో వాహనం నిలిపినందుకు రూ. 30 పార్కింగ్ ఫీజును వసూలు చేశారంటూ... రశీదును హర్ష్ అగర్వాల్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఆ కాంప్లెక్స్ కు అధికారులు రూ. 50 వేల జరిమానా విధించారు. మరోవైపు అబిడ్స్ లోని అహుజా ఎస్టేట్ లో వాహనాన్ని నిలిపినందుకు రూ. 40 ఫీజు వసూలు చేశారంటూ మన్నే సురేశ్ రశీదును పోస్ట్ చేశాడు. దీంతో ఆ సంస్థకు కూడా రూ. 50 వేల జరిమానా విధించారు. పార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి.