Etela Rajender: కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు: ఈటల
- ఉద్దేశపూర్వకంగా నాపై బురద చల్లుతున్నారు
- తనను పిలిపించి మాట్లాడితే బాగుండేది
- ఎవరెన్ని చేసినా బెదిరే ప్రసక్తే లేదు
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై నిన్న రాత్రి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఈరోజు ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనను పిలిపించి అడిగితే బాగుండేదని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ... వారు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు.
తనపై వస్తున్న కట్టు కథలను చూస్తుంటే బాధ కలుగుతోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత పత్రిక, చానల్ లోనే తనకు వ్యతిరేకంగా వరుస కథనాలు వస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని చేసినా తాను బెదరనని స్పష్టం చేశారు. విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.