Etela Rajender: అందులో అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలింది: విచారణ తర్వాత ఈటల వ్యవహారంపై కలెక్టర్
- మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో భూములపై విచారణ
- ఆరు ప్రత్యేక బృందాలతో భూముల సర్వే
- ఈటలకు చెందిన హేచరీస్‌లోనూ డిజిటల్ సర్వే
- వాటి పక్కన ఉన్న అసైన్డ్ భూముల పరిశీలన
- క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామన్న కలెక్టర్
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని అసైన్డ్ భూములను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కాజేశారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపై ఈ రోజు ఉదయం నుంచి అధికారులు వివరాలు సేకరిస్తోన్న విషయం తెలిసిందే. ఆరు ప్రత్యేక బృందాలతో భూములను సర్వే చేశారు. మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లోనూ డిజిటల్ సర్వే చేశారు. అలాగే, వాటి పక్కన ఉన్న అసైన్డ్ భూములను పరిశీలించారు.
మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో వాటికి సంబంధించిన రికార్డులను మెదక్ కలెక్టర్ హరీశ్ పరిశీలించి, అచ్చం పేటలోనూ విచారణ జరిపారు. రైతుల నుంచి ఆయన వివరాలు తీసుకున్నారు. ఆ భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు విచారణలో తేలిందని మీడియాకు తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు.