Uttar Pradesh: కౌంటింగ్ చేయకుంటే ఆకాశమేమీ ఊడిపడదు: యూపీ ఎలక్షన్ కమిషన్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం
- యూపీ పంచాయతీ ఎన్నికల లెక్కింపుపై అసహనం
- రెండు మూడు వారాలు వాయిదా వేస్తే ఏమవుతుందని ప్రశ్న
- కరోనా సంక్షోభం ఉంటే లెక్కింపు అవసరమా అని నిలదీత
- కరోనా కర్ఫ్యూ టైంలోనే కౌంటింగ్ జరుగుతుందన్న అదనపు సొలిసిటర్ జనరల్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు తారస్థాయిలో నమోదవుతున్నా.. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టడంపై అసహనం వ్యక్తం చేసింది. చివరకు ఓట్ల లెక్కింపునకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు లెక్కింపు చేయకుంటే ఆకాశమేమీ ఊడపడదంటూ మండిపడింది.
‘‘దేశంలో ఎక్కడ చూసినా కరోనా సంక్షోభమే ఉంది. ఆక్సిజన్, బెడ్ల కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్నికల కౌంటింగ్ ను నిలుపుదల చేయలేరా? ఒకవేళ ఓట్ల లెక్కింపుతో కేసులు పెరిగితే దానికి తగ్గట్టు వైద్య సదుపాయాలు కల్పించే శక్తి మీకుందా?’’ అని యూపీ ఎలక్షన్ కమిషన్ పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఏ ప్రాతిపదికన ఓట్ల లెక్కింపును చేపడుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించింది. రెండు మూడు వారాల పాటు కౌంటింగ్ ను వాయిదా వేస్తే ఏమవుతుందని నిలదీసింది.
‘‘2 లక్షల స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ చేస్తామంటున్నారు. కానీ, 800 కేంద్రాలే ఏర్పాటు చేశారు. ఒక్కో సీటులో ఎంతో మంది పోటీ చేశారు. అలాంటప్పుడు ఒక్క కేంద్రంలో 75 మందినే ఎలా అనుమతిస్తారు?’’ అని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన యూపీ అదనపు సొలిసిటర్ జనరల్ భాటీ.. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ ఉన్నందున ఎలాంటి నష్టం జరగబోదన్నారు. గుంపులను నియంత్రించేందుకు వీలుంటుందని చెప్పారు.
పేపర్ బ్యాలెట్ తో జరిగిన ఎన్నికలు కాబట్టి.. కౌంటింగ్ కు రెండు మూడు రోజులు పడుతుందని, సోమవారం నాటికి దీనిపై అఫిడవిట్ ను సమర్పిస్తామని చెప్పారు. మంగళవారం ఉదయం 7 గంటల దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. దీంతో చివరకు ప్రభుత్వ వాదనను ఆమోదించిన సుప్రీం కోర్టు కౌంటింగ్ కు ఓకే చెప్పింది.