Uttar Pradesh: ఆక్సిజన్ అందక.. బెడ్డు దొరక్క.. కారులోనే పోయిన ప్రాణాలు!
- నోయిడాలో దారుణ ఘటన
- 35 ఏళ్ల ఇంజనీర్ మృత్యువాత
- మూడు గంటల పాటు నరకయాతన
- మధ్యప్రదేశ్ లో ఉంటున్న భర్త, పిల్లలు
ఆక్సిజన్ అందక.. బెడ్డు దొరక్క.. కారులోనే ఓ కరోనా పేషెంట్ మరణించిన ఉదంతం ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జిమ్స్ ఆసుపత్రిలో జరిగింది. ఆమెకు తోడుగా ఉన్న వ్యక్తి ఆసుపత్రి సిబ్బందిని ఎంత బతిమాలినా బెడ్లు లేవన్న సమాధానమే వచ్చింది. దీంతో దాదాపు 3 గంటల పాటు ఊపిరాడక సతమతమైపోయిన ఆమె చివరకు ప్రాణాలు వదిలింది. చనిపోయిన మహిళ పేరు జాగృతి గుప్తా (35).
ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆమె భర్త పిల్లలు సొంత రాష్ట్రంలోనే ఉంటుండగా.. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆమె నోయిడాలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమె యజమాని ఆసుపత్రికి తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాతే వైద్యులు వచ్చి చూశారని, అప్పటికే ఆమె చనిపోయిందని పేర్కొన్నారు.