V Hanumantha Rao: ఈ పరిస్థితుల్లో ఈటలపై విచారణ జరపడమేమిటి?: వీహెచ్
- కేసీఆర్ కరోనాపై దృష్టి సారించాలి
- కేంద్రాన్ని తప్పుపట్టడమే ఈటల చేసిన తప్పా?
- ఆరోపణలు వచ్చిన అందరిపై విచారణ జరిపించాలి
ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని... ముందు కరోనాపై దృష్టి పెట్టాలని కేసీఆర్ కు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయని... పేషెంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి ఉందని... ఈ పరిస్థితుల్లో ఈటలపై విచారణకు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు. కోవిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును రెండు రోజుల క్రితం ఈటల తప్పుపట్టారని... అదే ఆయన చేసిన తప్పిదమా? అని మండిపడ్డారు.
నిజంగా కేసీఆర్ కు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలోనే ఈటలపై విచారణ ఎందుకు చేయలేదని వీహెచ్ నిలదీశారు. గతంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలపై ఆరోపణలు వచ్చాయని, వారిపై విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గాంధీ ట్రస్టు భూములు, వక్ఫ్ భూములు ఏమయ్యాయని అడిగారు. కీసరలో దళితుల భూములు కబ్జాకు గురవుతుంటే ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. ఈటలపై మాత్రమే కాకుండా ఆరోపణలు వచ్చిన అందరిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.