Vijayashanti: ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతికి వచ్చింది... ప్రజలు బెంబేలెత్తిపోవడం ఖాయం: విజయశాంతి

Vijayasanthi opines in CM KCR decided to handle health ministry

  • ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల తొలగింపు
  • ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్
  • విమర్శనాస్త్రాలు సంధించిన విజయశాంతి
  • స్వయంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి అని వ్యాఖ్యలు
  • ప్రజలు ఇక దేవుడే దిక్కంటున్నారని వెల్లడి

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. పైగా ఆరోగ్య శాఖను తానే స్వయంగా చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనిపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. కారణాలు ఏవైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ నిర్వహణలోకి వచ్చిందని, ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు మరింత భీతిల్లిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి పేర్కొన్నారు.

తెలంగాణలో కరోనా కట్టడి తీరుపై ఓవైపు హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతోందని, పాలకులు హైకోర్టు మందలింపులు, హెచ్చరికలు చవిచూస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి దుస్థితిలో, అసలు దర్శనమే దొరకని సీఎం కేసీఆర్ చేతికి వైద్య ఆరోగ్య శాఖ వెళ్లిందని తెలిపారు. స్వయంగా ఆయనే కరోనా నిబంధనలు ఉల్లంఘించి కొవిడ్ బారినపడిన వ్యక్తి అని విజయశాంతి విమర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితర గులాబీ దళ నేతలు కరోనా బారినపడ్డారని వివరించారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, అత్యున్నత స్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండని కేసీఆర్ చేతికి... అదికూడా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ వెళ్లడం ప్రజలను కలవరానికి గురిచేస్తోందని విజయశాంతి పేర్కొన్నారు. ఇలాంటి సీఎం చేతిలో పడినందుకు కాపాడమంటూ "కుచ్ 'కరోనా' భగవాన్" అని తెలంగాణ ప్రజలు దేవుడిపైనే భారం మోపి కాలం వెళ్లబుచ్చుతున్నారనేది నేటి కఠోర వాస్తవం అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News