Delhi: కళ్ల ముందే కొవిడ్‌తో మరణిస్తుంటే తట్టుకోలేక ఒత్తిడిలోకి జారుకొని ఆత్మహత్య చేసుకున్న డాక్టర్!
- ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన
- వెల్లడించిన ఐఎంఏ మాజీ చీఫ్ వంఖేడ్కర్
- వందలాది మందిని కాపాడిన డాక్టర్
- ఇది వ్యవస్థ చేసిన హత్య అని వంఖేడ్కర్ ఆరోపణ
ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వివేక్ రాయ్ అనే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)’ మాజీ చీఫ్ డాక్టర్ రవి వంఖేడ్కర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఒత్తిడి తట్టుకోలేకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా నుంచి ఆయన వందలాది మంది ప్రాణాల్ని కాపాడారని తెలిపారు.
ప్రతిరోజు విషమ పరిస్థితుల్లో ఉన్న కనీసం ఆరు నుంచి ఏడు మందికి రాయ్ దగ్గరి నుంచి చికిత్స అందించేవారని వంఖేడ్కర్ తెలిపారు. కానీ, మహమ్మారితో తన కళ్ల ముందే అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే తట్టుకోలేకే ఒత్తిడిలోకి జారుకున్నాడని తెలిపారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ వంఖేడ్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాయ్‌ది వ్యవస్థ చేసిన హత్య అని ఆరోపించారు. కనీస వైద్య సౌకర్యాల కొరత, ఔషధాల లేమి, అశాస్త్రీయ విధానాలు, అనవసర రాజకీయాలు, అసమర్థ పాలన వల్లే వైద్యుల్లో నిరాశ పెరిగి ఒత్తిడిలోకి జారుకుంటున్నారని ఆరోపించారు.