David Warner: డేవిడ్ వార్నర్ కు ఇంత అవమానమా?: సన్ రైజర్స్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!
- డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా తొలగించిన సన్ రైజర్స్
- కేన్ విలియన్సన్ కు బాధ్యతలు
- మీమ్స్ తో మండిపడుతున్న అభిమానులు
సన్ రైజర్స్ కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఒకసారి సీజన్ కప్ కు, మూడు సార్లు ప్లే ఆఫ్ కు తీసుకెళ్లిన డేవిడ్ వార్నర్ ను నాయకత్వ హోదా నుంచి తొలగించడం ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. వార్నర్ ను తొలగించి, కేన్ విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమిస్తున్నామని నిన్న సన్ రైజర్స్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విలయమ్సన్ పై తమకు ఎంతో గౌరవం ఉందని అంటూనే, గడచిన ఐదేళ్లుగా జట్టును విజయవంతంగా నడిపిస్తూ వచ్చిన వార్నర్ కు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ పలు రకాల మీమ్స్ తో రెచ్చి పోతున్నారు.
వార్నర్ ను అవమానించారని, ఆయనకు వెన్నుపోటు పొడిచారని, జట్టు కోచ్ లక్షణ్, టామ్ మూడీల పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని, మీ నిర్ణయానికి సిగ్గుపడుతున్నామని... ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో శనివారం నాడు వార్నర్ ను తొలగిస్తున్నట్టు ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం పెట్టిన ట్వీట్ టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.
కాగా, '"గత కొన్నేళ్లుగా నాయకత్వ బాధ్యతలతో జట్టును నడిపించిన వార్నర్ కు మా కృతజ్థతలు. ఆ బాధ్యతల నుంచి వార్నర్ ను తప్పించినంత మాత్రాన అతనిపై మాకున్న గౌరవం ఎప్పటికీ చెరగబోదు. డేవిడ్ వార్నర్ మా జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్. విలియమ్సన్ నాయకత్వంలో వార్నర్ మరింతగా రాణించాలని కోరుకుంటున్నాం. అది ఆన్ ఫీల్డ్ లేదా ఆఫ్ ఫీల్డ్ కావొచ్చు . వార్నర్ సలహాలు ఎల్లప్పుడూ మాకు అవసరం" అని ట్వీట్ చేసింది.
ఇక ఆన్ ఫీల్డ్ లేదా ఆఫ్ ఫీల్డ్ అని సన్ రైజర్స్ పేర్కొనడం అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అతన్ని జట్టు నుంచి పూర్తిగా తొలగించాలని యాజమాన్యం భావిస్తోందని అనుమానిస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడగా, ఐదింటిలో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే.