Somireddy Chandra Mohan Reddy: పీకే ది బెస్ట్... అక్కడ మమతా, ఇక్కడ స్టాలిన్: ప్రశాంత్ కిశోర్ వ్యూహాలపై సోమిరెడ్డి స్పందన
- పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రభంజనం
- తమిళనాట విజయం ఖాయం చేసుకున్న డీఎంకే
- రెండు పార్టీలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్
- పీకే వ్యూహాలే పైచేయి సాధించాయన్న సోమిరెడ్డి
దేశంలో మినీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్లు లెక్కిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే విజయాలు దాదాపు ఖాయమయ్యాయి. ఆ రెండు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యవహరించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.
బెంగాల్, తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ టీమ్ లే గెలిచాయని వెల్లడించారు. మమతా బెనర్జీని బీజేపీ ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదని విశ్లేషించారు. దేశంలోనే వీరనారిగా ఆమె గెలిచారని కితాబిచ్చారు. తమిళనాడులోనూ పీకే వ్యూహాలే పైచేయి సాధించాయని, స్టాలిన్ ను సీఎంగా చేస్తున్నాయని వివరించారు. మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.