KCR: నాగార్జునసాగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
- నాగార్జునసాగర్ బరిలో టీఆర్ఎస్ విజయం
- జానారెడ్డిపై నెగ్గిన నోముల భగత్
- స్పందించిన సీఎం కేసీఆర్
- త్వరలోనే నాగార్జునసాగర్ లో పర్యటిస్తానని వెల్లడి
- ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టీకరణ
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన టీఆర్ఎస్ పార్టీకి నాగార్జునసాగర్ విజయం ఎంతో ఊరటనిచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం బరిలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. తమ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించినందుకు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నాగార్జునసాగర్ ను సందర్శిస్తానని, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేస్తామని అన్నారు.
నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించడం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున నోముల తనయుడు భగత్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నాయక్ పోటీ చేశారు.