Andhra Pradesh: ఏపీలో కరోనా కల్లోలం... సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
- గత 24 గంటల్లో 1,14,299 కరోనా పరీక్షలు
- 23,920 మందికి కరోనా పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 2,945 కొత్త కేసులు
- రాష్ట్రంలో 83 మంది మృతి
- ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 12 మంది బలి
ఏపీలో సెకండ్ వేవ్ మొదలయ్యాక కరోనా కేసుల్లో పెరుగుదలే తప్ప తగ్గుదల నమోదు కావడంలేదు. తాజాగా రికార్డు స్థాయిలో 23 వేలకు పైగా కొత్త కేసులు గుర్తించారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక రోజువారీ కేసులు ఇవే. గడచిన 24 గంటల్లో ఏపీలో 1,14,299 నమూనాలు పరీక్షించగా 23,920 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,945 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,831 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 2,724 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 11,411 మంది కరోనా నుంచి కోలుకోగా, 83 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 11,45,022 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,93,708 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,43,178 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,136కి పెరిగింది.