West Bengal: పార్టీ మారిన వాళ్లను ప్రజలు తిరస్కరించారు: బెంగాల్ బీజేపీ చీఫ్
- ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం
- బలమైన ప్రతిపక్షంగా మారాం
- ప్రజల నాడిని అంచనా వేయలేకపోయాం
పశ్చిమ బెంగాల్‌లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ప్రజల తరపున శాసనసభలో గళం విప్పుతామని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. 2016 ఎన్నికల్లో మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైన తాము ఈసారి బలమైన ప్రతిపక్షంగా మారే స్థాయికి చేరుకున్నామన్నారు. చాలా స్థానాల్లో కొద్దిపాటి మెజారిటీతోనే తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని అన్నారు.
ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది నేతలు ఓటమి పాలయ్యారని దిలీప్ ఘోష్ వివరించారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడిన నేతలను ప్రజలు అంగీకరించలేదన్నారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదన్నారు. ప్రజల నాడిని అంచనా వేయలేమని, ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తామని దిలీప్ ఘోష్ చెప్పుకొచ్చారు.