Mamata Banerjee: బెంగాల్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు.. తృణమూల్‌పై ఆరోపణలు

BJP Office Set On Fire In Bengal

  • అరాంబాగ్‌లో బీజేపీ కార్యాలయం బూడిద
  • రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ ఇవే పరిస్థితులు ఉంటాయన్న బీజేపీ
  • తమ పార్టీ అభ్యర్థిపైనే దాడి జరిగిందన్న మమత

పశ్చిమ బెంగాల్‌లోని అరాంబాగ్‌లో బీజేపీ కార్యాలయం అగ్నికి ఆహుతి కావడంపై రాజకీయ రగడ మొదలైంది. టీఎంసీ, బీజేపీ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఎన్నికల ఫలితాల్లో అధికార టీఎంసీ దూసుకుపోతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కార్యాలయం మంటల్లో చిక్కుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. హుగ్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాంబాగ్‌లో బీజేపీ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ కార్యాలయం అగ్నికి ఆహుతవుతున్న వీడియోను పోస్టు చేసిన బీజేపీ నేతలు ఇది తృణమూల్ పార్టీ పనేనని ఆరోపించారు. టీఎంసీ గూండాలు తమ కార్యాలయాన్ని తగలబెట్టేశారని బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. రానున్న ఐదేళ్లు రాష్ట్రంలో ఇవే పరిస్థితులు ఉంటాయనడానికి ఇది నిదర్శనమన్నారు. కార్యాలయం మంటల్లో తగలబడుతున్నా టీఎంసీ కార్యకర్తలు ఆర్పే ప్రయత్నం చేయలేదన్నారు. బిష్ణుపూర్‌లోని తమ బూత్ ఏజెంట్ ఇంటిని కూడా తగలబెట్టేశారని ఆరోపించారు.

బీజేపీ ఆరోపణలపై మమత తీవ్రంగా స్పందించారు. తమ అరాంబాగ్ అభ్యర్థి సుజాతా మండల్‌ను బీజేపీ కార్యకర్తలు వెంబడించి దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News