Tamilnadu: కరుణానిధి కుటుంబంలో మూడో తరం వారసుడు రెడీ!
- ఈ వారంలో సీఎంగా ప్రమాణం చేయనున్న స్టాలిన్
- తండ్రితో పాటు అసెంబ్లీకి వెళ్లనున్న ఉదయనిధి
- మంత్రి పదవి ఖాయమంటున్న డీఎంకే వర్గాలు
తమిళనాడుకు సీఎంగా ఎంకే స్టాలిన్ అతి త్వరలోనే పగ్గాలను స్వీకరించనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని డీఎంకే, అధికారంలో ఉన్న అన్నా డీఎంకేపై ఘన విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో తండ్రి స్టాలిన్ తో పాటు కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీలో కాలుమోపనున్నారు. తద్వారా కరుణానిధి కుటుంబంలో మూడవ తరం రాజకీయాల్లోకి ప్రవేశించినట్లయింది. ఇప్పటికే సినీ నటుడిగా, నిర్మాతగా తమిళుల్లో గుర్తింపు పొందిన ఉదయనిధి, డీఎంకే యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులై, రాజకీయ అరంగేట్రం చేశారు.
ఆపై తాజా ఎన్నికల్లో చేపాక్కం - ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తొలిసారిగా అసెంబ్లీలో కాలుమోపుతున్నట్టు కాగా, ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమని డీఎంకే వర్గాలు అంటున్నాయి. స్టాలిన్ ఈ నెల 6న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. ఆయనకు భార్య దుర్గతో పాటు కుమార్తె సెంతామరై కూడా ఉన్నారు.