Sabbam Hari: మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
- ఇటీవల కరోనా బారినపడిన సబ్బం హరి
- మొదట ఐసోలేషన్ లో చికిత్స
- వైద్యుల సలహా మేరకు విశాఖలోని ఓ ఆసుపత్రిలో చేరిక
- ఇటీవల పరిస్థితి విషమం
- అప్పటినుంచి మరింత క్షీణించిన ఆరోగ్యం
టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న సబ్బం హరి గతంలో విశాఖ మేయర్ గానూ పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అప్పట్లో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఓ దశలో ఓదార్పు యాత్రలో జగన్ వెంటే నడిచారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను రాజకీయాలకు దూరం చేశాయి. ఆపై టీడీపీలో చేరారు. కొన్నివారాల కిందట కరోనా బారినపడిన ఆయన మొదట ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ లక్షణాలు తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. కానీ చికిత్స పొందుతుండగా, ఇటీవల పరిస్థితి విషమించింది. అప్పటినుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది.