Adar Poonawala: రాత్రికి రాత్రే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచలేం: అదర్ పూనావాలా

Adar Poonawala says not possible vaccine production overnight
  • భారత్ లో లక్షల సంఖ్యలో కరోనా కేసులు
  • వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్
  • వ్యాక్సిన్ తయారీ ఓ ప్రత్యేక విధానమన్న పూనావాలా
  • ఇబ్బడిముబ్బడిగా తయారుచేయలేమని వెల్లడి
దేశంలో లక్షల్లో కరోనా కేసులు వస్తుండడంతో వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో పెద్ద సంఖ్యలో డోసులు కావాలంటూ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితులపై సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. రాత్రికి రాత్రే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీ అనేది ప్రత్యేకమైన ప్రక్రియ అని, ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారుచేయలేం అని వివరించారు.

భారత్ లో వయోజనులందరికీ తగినన్ని డోసులు ఉత్పత్తి చేయడం మామూలు విషయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అన్ని విధాల సహాయసహకారాలు అందుతున్నాయని పూనావాలా వెల్లడించారు. తదుపరి కొన్ని నెలల్లో 11 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం ప్రభుత్వం నుంచి రూ.1,732.50 కోట్లు అడ్వాన్స్ గా అందిందని నిర్ధారించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు తమకు 26 కోట్ల డోసులకు ఆర్డర్లు వచ్చాయని, ఇప్పటివరకు 15 కోట్ల డోసులను సరఫరా చేశామని అదర్ పూనావాలా వివరించారు. మిగిలిన 11 కోట్ల డోసులను రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు రాబోయే కొన్నినెలల్లో సరఫరా చేస్తామని తెలిపారు.  

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ ను పుణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లకు విపరీతమైన స్థాయిలో ఆర్డర్లు వస్తుండడంతో ఎవరికీ సమాధానం చెప్పుకోలేక, సీరం అధిపతి అదర్ పూనావాలా కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చాయి.
Adar Poonawala
Vaccine
Covishield
Production
Serum
India

More Telugu News