AP High Court: సంగం డెయిరీ కేసు: ధూళిపాళ్లను మూడ్రోజుల పాటు విచారించాలని హైకోర్టు ఆదేశం
- సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల అరెస్టు
- 5 రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు
- హైకోర్టును ఆశ్రయించిన ధూళిపాళ్ల
- స్టే ఇచ్చిన హైకోర్టు
- ధూళిపాళ్ల పిటిషన్ పై నేడు పూర్తిస్థాయి విచారణ
సంగం డెయిరీ వ్యవహారంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను మూడ్రోజుల పాటు విచారించాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. ఇటీవల ధూళిపాళ్లను 5 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ధూళిపాళ్ల హైకోర్టులో సవాల్ చేశారు. తొలుత శనివారం నాడు ఏసీబీ కస్టడీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, ఆ పిటిషన్ పై నేడు పూర్తిస్థాయి విచారణ చేపట్టింది.
ధూళిపాళ్లను 3 రోజులు ప్రశ్నించాలని, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ను రెండు రోజుల పాటు విచారించాలని స్పష్టం చేసింది. సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను కూడా విచారించాలని ఆదేశించింది. రాజమండ్రి జైల్లోనే ఏసీబీ అధికారులు ప్రశ్నించాలని హైకోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా కరోనా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది.