Chandrababu: రాష్ట్రంలో ఎన్440కే రకం వైరస్ వ్యాపిస్తోంది... ఇది అన్ని రకాల కంటే ప్రమాదం: చంద్రబాబు
- టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
- ఏపీలో కరోనా పరిస్థితులపై చర్చ
- ఎన్440కే ఇతర రకాల కంటే 10 రెట్లు ప్రమాదకరమని వెల్లడి
- ఏపీలో ఇకనైనా లాక్ డౌన్ విధించాలని డిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. ప్రస్తుతం ఏపీలో అతి ప్రమాదకరమైన ఎన్440కే కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాపిస్తోందని అన్నారు. దీన్ని సీసీఎంబీ పరిశోధకులు కర్నూలులో గుర్తించారని, ఇది ఇతర కరోనా వైరస్ స్ట్రెయిన్ ల కంటే 10 రెట్లు శక్తిమంతమైనదని వివరించారు. వ్యాప్తిలో ఉన్న ఇతర వైరస్ రకాల కంటే అత్యంత ప్రమాదకరమైనదని వెల్లడించారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి లాక్ డౌన్ విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న ఒడిశాలో లాక్ డౌన్ విధించారని తెలిపారు. ఏపీలో వ్యాక్సినేషన్ అంశాన్ని పట్టించుకోవడంలేదని, వ్యాక్సిన్ డోసుల కోసం ఇతర రాష్ట్రాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని విమర్శించారు. అనవసరంగా కార్యాలయాల కోసం మూడు వేల కోట్ల రూపాయలు వృథా చేశారని ఆరోపించారు.