Grand Central Vista: ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా... సెంట్రల్ విస్టా పూర్తికి డెడ్ లైన్ విధించిన కేంద్రం!

Center Deadline for Central Vista Project

  • కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా
  • డిసెంబర్ 2022 నాటికి ప్రధాని నివాసం, కార్యాలయం
  • పనులు నిరాటంకంగా కొనసాగించాలని ఆదేశం

గ్రాండ్ సెంట్రల్ విస్టా... న్యూఢిల్లీ నడిబొడ్డున కేంద్రం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నా, ఈ మొత్తం భవనాల సముదాయంలో ప్రధాని నూతన నివాసం, కార్యాలయ భవనాలను డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయి. ఈ ప్రాజెక్టును అత్యవసరంగా పేర్కొన్న కేంద్రం, పనులు నిరాటంకంగా కొనసాగించాలని ఆదేశించింది.

దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును విపక్షాలు, హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ముందుకు సాగాలనే కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి పీఎం అధికారిక నివాసాన్ని పూర్తి చేయాలని టార్గెట్ విధించినట్టు తెలుస్తోంది. ఇదే సమయానికి ప్రధాని భద్రత నిమిత్తం నియమించబడే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అధికారిక కార్యాలయాన్ని కూడా నిర్మించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రస్తుతం ప్రధాని నివాసం లోక్ నాయక్ మార్గ్ (గతంలో రేస్ కోర్స్ రోడ్)లోని 7వ నంబర్ లో నాలుగు బంగళాల కాంప్లెక్స్ గా కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. నూతనంగా నిర్మించబడనున్న సెంట్రల్ విస్టాకు ఇది కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒక్క ప్రధాని నివాసం, ఎస్పీజీ కార్యాలయం కోసమే రూ. 13,450 కోట్లు ఖర్చవుతాయని తెలుస్తోంది.

అయితే, ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాలను నాశనం చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం, ఈ ప్రాజెక్టును తలపెట్టిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఉన్న నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టును 2024 సార్వత్రిక ఎన్నికల్లోగా పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో మోదీ సర్కారు అడుగులు వేస్తోంది.

  • Loading...

More Telugu News