Vijayawada: బెజవాడ విమానాశ్రయంలో కఠిన కొవిడ్ ఆంక్షలు!
- తక్షణం అమల్లోకి వచ్చిన ఆదేశాలు
- ప్రధాన ద్వారం వద్దే గెస్టుల నిలిపివేత
- దేశంలోని ఎక్కడి నుంచి వచ్చినా కరోనా టెస్ట్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, విజయవాడ విమానాశ్రయంలో కఠిన కొవిడ్ ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చే వ్యక్తితో పాటు మరొకరికి, వాహనం డ్రైవర్ కు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఇక తమ వారిని విమానం ఎక్కించేందుకు లేదా రిసీవ్ చేసుకునేందుకు వచ్చే వారిని ప్రధాన ద్వారం వద్దనే నిలిపివేస్తారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తుండగా, ఇకపై దేశంలోని ఎక్కడి నుంచి వచ్చే వారికైనా కొవిడ్ టెస్ట్ చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.