Etela Rajender: తెలంగాణ తెచ్చింది కుటుంబ పాల‌న కోసం కాదు: మ‌రోసారి ఈట‌ల తీవ్ర విమ‌ర్శ‌లు

etela slams trs

  • నాది ఆత్మ‌గౌర‌వ ఉద్యమం
  • ఎంగిలి మెతుకుల కోసం ఆశ‌ప‌డ‌ను
  • ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పాల‌న కొన‌సాగాలి
  • ప్రజ‌ల అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ పాల‌న కొన‌సాగాలి  

త‌న‌ది ఆత్మ‌గౌర‌వ ఉద్యమమ‌ని తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. ఎన్నారైల‌తో ఆయ‌న తాజాగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌లోభాల‌కు లొంగ‌లేదు కాబ‌ట్టే నాపై నింద‌లు వేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ తెచ్చింది కుటుంబ పాల‌న కోసం కాద‌ని తెలిపారు. తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశ‌ప‌డ‌న‌ని చెప్పుకొచ్చారు. 2014కు ముందు పాల‌కులు ప్ర‌లోభాల‌కు లొంగిపోయి పాల‌న కొన‌సాగించార‌ని, ప్ర‌జ‌ల కోసం కాకుండా అధికారం కోస‌మే పాకులాడారని ఆయ‌న ఆరోపించారు.

ఇప్పుడు కూడా అచ్చం అదే రీతిలో పాల‌న కొన‌సాగుతోంద‌ని ఈట‌ల రాజేంద‌ర్  విమ‌ర్శించారు. చాలా మంది తెలంగాణ వాదులు ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పాల‌న కొన‌సాగాల‌ని కోరుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తిలో పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ వాదుల భాగ‌స్వామ్యం లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు పాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని చెప్పారు.

అన్ని వ్య‌వ‌హారాలు ప్ర‌జాస్వామ్య‌యుతంగా కొన‌సాగాల‌ని త‌న‌లాంటివారు చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్రజ‌ల అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ పాల‌న కొన‌సాగాలి త‌ప్ప వారి అభిప్రాయాల‌కు విలువ లేకుండా పాల‌న కొన‌సాగ‌డం స‌రికాద‌న్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు నిర్మించ‌డం, రోడ్లు వేయించ‌డం మాత్ర‌మేన‌న్న భావ‌న స‌రికాద‌ని ఈట‌ల రాజేంద‌ర్  చెప్పారు.

'ఆనాడు బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా మ‌నం ఎందుకు కొట్లాడాం. బ్రిటిష్ వారు అభివృద్ధి ప‌నుల‌ను చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కాదు. భారత జాతి స్వ‌తంత్రంగా ఉండాల‌ని స్వ‌యం పాల‌న కావాల‌ని కొట్లాడాం' అని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News