Kangana Ranaut: తన ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేయడంపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
- నా ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు
- నా గొంతుకను వినిపించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి
- తెల్ల జాతీయులకు మనమంటే ద్వేషం ఉంటుంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఖాతాను ట్విట్టర్ తొలగించిన సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కంగన వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ తన పాత విశ్వరూపాన్ని చూపాలని... మమతను ఓ ఆట ఆడించాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది.
ఈ నేపథ్యంలో కంగన స్పందిస్తూ ట్విట్టర్ పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ అమెరికన్లదని.. పుట్టుకతోనే తెల్లజాతీయులకు గోధుమరంగులో ఉండే జాతీయులపై ద్వేషం ఉంటుందని మండిపడింది. మీరు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం ఆలోచించాలి అనేది కూడా వాళ్లే చెప్పాలనుకుంటారని విమర్శించింది. తన ఖాతాను ట్విట్టర్ ఆపేసినంత మాత్రాన తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పింది. తన గొంతుకను వినిపించేందుకు తనకు ఇతర అనేక మార్గాలు ఉన్నాయని తెలిపింది. తన సొంత సినిమాల ద్వారా కూడా తాను చెప్పాలనుకున్నది చెప్పగలనని వ్యాఖ్యానించింది.
వేలాది సంవత్సరాలుగా మన దేశ ప్రజలు బాధను, బానిసత్వాన్ని అనుభవించడం తనను ఆవేదనకు గురి చేస్తోందని... ఆ బాధలకు ఇప్పటికీ ముగింపు పడలేదని కంగన చెప్పింది.