Goldman Sachs: భారత జీడీపీ అంచనాల్ని తగ్గించిన గోల్డ్‌మన్ శాక్స్
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
- అందుకే 11.7% నుంచి 11.1శాతానికి తగ్గింపు
- దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినా ప్రభావం తక్కువే
- ఇప్పటి వరకు అమలు చేసిన ఆంక్షల ప్రభావమూ తక్కువే
కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు భారత జీడీపీ అంచనాల్ని తగ్గించాయి. తాజాగా గోల్డ్‌మన్ శాక్స్ సైతం భారత వృద్ధిరేటు అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ ఆర్ధిక సంవత్సరం భారత్ 11.1శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను సవరించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ఒకవేళ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినా.. గత ఏడాదితో పోలిస్తే దాని అమలులో తీవ్రత అంతగా ఉండకపోవచ్చునని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. అలాగే ఇప్పటి వరకు విధించిన లాక్‌డౌన్లు, ఇతర ఆంక్షల ప్రభావం కూడా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అంచనాల్ని స్వల్పంగా సవరించి 11.7 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గించామని పేర్కొంది.