Mali: స్కానింగ్‌లో ఏడుగురు శిశువుల గుర్తింపు.. చివరికి తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ!

Mali Woman Gives Birth To Nine Babies

  • పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఘటన
  • అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఏడుగురు  ఉన్నట్టు గుర్తింపు
  • మొరాకో తరలించి సిజేరియన్ చేసిన వైద్యులు
  • తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారన్న ఆరోగ్య మంత్రి

పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఓ మహిళ ఏకంగా తొమ్మిదిమంది శిశువులకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఆమె గర్భంలో ఏడుగురు ఉన్నట్టు పరీక్షల్లో వైద్యులు గుర్తించారు. అయితే, ఆమె మరో ఇద్దరికి అదనంగా జన్మనివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హలీమా సిస్సే అనే 25 ఏళ్ల మహిళ గర్భిణిగా పరీక్షల కోసం ఈ ఏడాది మార్చిలో ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలో ఏడుగురు పెరుగుతున్నట్టు గురించారు. సిస్సే ప్రసవ సమయంలో నిపుణుల పర్యవేక్షణ అవసరమని చెప్పి మొరాకోలోని ఆసుపత్రికి తరలించారు. తాజాగా అక్కడామె ప్రసవించింది.

మొత్తం తొమ్మిదిమందికి ఆమె జన్మనివ్వగా వారిలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మాలి ఆరోగ్య మంత్రి ఫంటా సిబీ తెలిపారు. మొరాకో, మాలిలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఏడుగురు శిశువులే ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే, సిజేరియన్ సమయంలో మరో ఇద్దరు కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి జననాల్లో నవజాత శిశువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News