Australia: ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ కిడ్నాప్ కేసులో నలుగురి అరెస్ట్!
- గత నెలలో ఘటన
- కిడ్నాపైన గంట వ్యవధిలోనే విడుదల
- కేసును విచారించిన పోలీసులు
ఆస్ట్రేలియా క్రికెటర్, టెస్ట్ బౌలర్ స్టువర్ట్ మెక్ గిల్ ఆమధ్య కిడ్నాప్ కావడం తీవ్ర కలకలం రేపగా, కేసును విచారించిన పోలీసులు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా తరఫున 44 టెస్ట్ మ్యాచ్ లను ఆడిన మెక్ గిల్, లెజండరీ దిగ్గజం షేన్ వార్న్ ఆడుతున్న సమయంలోనే జట్టులో ఉండటంతో అతని ప్రతిభ వెలుగులోకి రాలేదు.
జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలిపిన పోలీసులు, 50 ఏళ్ల మెక్ గిల్ ను, ఏప్రిల్ 14న ఓ జంక్షన్ లో అటకాయించిన కిడ్నాపర్లు, మరో వాహనంలో బలవంతంగా తీసుకుని వెళ్లారు. సిడ్నీకి గంట ప్రయాణం దూరంలో ఉన్న తన ప్రాపర్టీ వద్దకు మెక్ గిల్ వెళుతున్న వేళ, తుపాకులతో బెదిరించిన దుండగులు, అతన్ని కిడ్నాప్ చేశామని వెల్లడించారు. ఆపై గంట తరువాత అతన్ని విడచి పెట్టారని న్యూసౌత్ వేల్స్ పోలీసు సూపరింటెండెంట్ ఆంటోనీ హోల్టన్ వెల్లడించారు.
కేసును విచారించిన తరువాత, మెక్ గిల్ కు తెలిసిన ఓ వ్యక్తి కిడ్నాపర్లలో ఒకరని గుర్తించి, అతని గురించి వేట ప్రారంభించామని, దాదాపు 20 రోజుల తరువాత నిందితులందరినీ అరెస్ట్ చేశామని, వీరంతా 27 నుంచి 46 ఏళ్ల మధ్య వయసున్న వారని తెలిపారు. కిడ్నాప్ చేసిన వారు డబ్బులను డిమాండ్ చేసినా, వారికి ఎటువంటి ప్రతిఫలమూ అందలేదని స్పష్టం చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.