Corona Virus: తల్లిని, భర్తను తీసుకుని ఎన్నో ఆసుపత్రులు తిరిగాను.. ఎక్కడా బెడ్ దొరకలేదు: దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జనరల్ అర్చన
- తమ కుటుంబానికి ఏమీకాదని చాలా మంది భావిస్తుంటారు
- నా విషయంలోనూ అలాగే జరిగింది
- కుమారుడు మినహా నా కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది
- నా మేనకోడలి పరిస్థితి విషమంగా ఉంది
దేశంలో కరోనా విజృంభణ కలకలం రేపుతోంది. సమాజంలో మంచి పేరున్న వారికి కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కళ్లముందే తమ ప్రాణానికి ప్రాణమైన కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. ఇక సామాన్యులు, పేదలు ఎదుర్కొంటోన్న పరిస్థితులు వర్ణనాతీతం. కరోనా వేళ అనారోగ్యం పాలైన తన తల్లిని, భర్తను తీసుకుని ఎన్నో ఆసుపత్రులు తిరిగానని, అయినా ఎక్కడా బెడ్ దొరకలేదని దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జనరల్ అర్చన దత్తా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం అందరితోనూ కన్నీరు పెట్టిస్తోంది.
తమ కుటుంబానికి ఏమీకాదని తనలాంటి చాలా మంది ప్రజలు భావిస్తుంటారని, అయితే, తన విషయంలో మాత్రం విషాద ఘటన చోటు చేసుకుందని ఆమె చెప్పారు. వైద్యం అందకపోవడంతో తన తల్లి, భర్త మృతి చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లినా వారు చేర్చుకోలేదని చెప్పారు.
చివరకు తన తల్లి, భర్తను కోల్పోయానని, మృతిచెందాక వారిద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆమె వివరించారు. తన కుమారుడు అభిషేక్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు అందరికీ పాజిటివ్ వచ్చిందని ఆమె చెప్పారు. తన మేనకోడలి పరిస్థితి క్షీణిస్తోందని తెలిపారు. ఆక్సిజన్ కోసం తిరుగుతున్నామని చెప్పారు.
కాగా, అర్చన భర్త పేరు ఏఆర్ దత్తా. ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆమె తల్లి పేరు బనీ ముఖర్జీ. వారిద్దరి ఆరోగ్యం గత నెల 27న ఆందోళనకరంగా మారడంతో వారిద్దరినీ మొదట దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోలేదు.
అనంతరం పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా వారు చేర్చుకోకపోవడంతో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో కొన్ని గంటల వ్యవధిలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతుండడంతో ఆసుపత్రులన్నీ నిండిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉండడం లేదు.
కాగా, ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ హీరోయిన్ ఇంట్లోనూ మరో విషాద ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి పియా బాజ్ పాయ్ ఇటీవల ఓ ట్వీట్ చేసింది. ఫరూఖాబాద్ జిల్లాలోని కయంగంజ్ బ్లాక్‌లో ఉండే తన సోదరుడి పరిస్థితి కరోనా వల్ల విషమించిందని, అతడికి బెడ్, వెంటిలేటర్ అత్యవసరమని, ఎవరైనా సాయం చేయండని ట్విట్టర్ లో కోరింది. అనంతరం కొన్ని గంటలకే మరో ట్వీట్ చేసింది. తన సోదరుడు మృతి చెందాడని పేర్కొంటూ, ఆవేదన వ్యక్తం చేసింది.