Mamata Banerjee: హింసాత్మక ఘటనల్లో దీదీ హస్తముందని ఆమె మౌనమే చెబుతోంది: జె.పి.నడ్డా ఆరోపణ
- ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో ఘర్షణలు
- బీజేపీ, తృణమూల్ పరస్పరం విమర్శలు
- రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో నడ్డా
- రక్తపు మరకలతో దీదీ మూడో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారని విమర్శ
- పలువురు కార్యకర్తలను పరామర్శించిన నడ్డా
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యమంత్రి మమత బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. దీదీ తన చేతులలో రక్తపు మరకలతో మూడో దఫా పాలనను మొదలుపెట్టారన్నారు. బెంగాల్లో జరిగిన మారణహోమం, 36 గంటల పాటు మమత దీనిపై మౌనం వహించడం చూస్తుంటే ఈ ఘటనలో ఆమె హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోందని నడ్డా ఆరోపించారు.
ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఘర్షణల్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని నడ్డా అన్నారు. ఈ ఘటనల్లో బాధితులుగా మిగిలిన బెంగాల్లోని ప్రతి పౌరుడి పక్షాన తమ పార్టీ నిలుస్తుందన్నారు. హింసాత్మక ఘటనల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాల హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నడ్డా బెంగాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనల్లో బాధితులుగా మిగిలినట్లు చెబుతున్న పలువురు కార్యకర్తలను ఆయన పరామర్శించారు.