Amararaja Batteries: అమరరాజా సంస్థకు హైకోర్టులో ఊరట
- అమరరాజా సంస్థపై ఇటీవల ఏపీపీసీబీ కొరడా
- కాలుష్య నిబంధనలు పాటించడంలేదంటూ మూసివేత ఆదేశాలు
- అమరరాజా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
- హైకోర్టును ఆశ్రయించిన గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు
నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇటీవల అమరరాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) మూసివేత ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అటు, అమరరాజా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీనిపై సదరు సంస్థ యాజమానులైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.. కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను ఇచ్చింది.
గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకు చిత్తూరు జిల్లాలో పలు చోట్ల బ్యాటరీ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అయితే కొంతకాలంగా అమరరాజా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలేదని ఏపీపీసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మూసివేత ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అమరరాజా వర్గాలు స్పందిస్తూ, తమది బాధ్యతాయుతమైన సంస్థ అని పేర్కొన్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ పరిశ్రమల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించాయి. కాలుష్య నియంత్రణ కోసం భారీగా వెచ్చిస్తున్నామని తెలిపాయి.