BCCI: ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబరులో!

BCCI plans to conduct rest of IPL in overseas

  • భారత్ లో కరోనా విలయతాండవం
  • కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఐపీఎల్
  • మిగిలిన మ్యాచ్ లపై అనిశ్చితి
  • ప్రత్యామ్నాయ వేదికలుగా ఇంగ్లండ్, యూఏఈ, ఆస్ట్రేలియా

కరోనా రక్కసి ధాటికి ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బయో బబుల్ అమలు చేసినప్పటికీ, ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీ నిలిపివేయక తప్పలేదు. ఐపీఎల్ తాజా సీజన్ ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ... మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబరులో నిర్వహించాలని ఆలోచిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరులో ఐపీఎల్ రెండో దశ నిర్వహణకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్చిస్తున్నాయి.

ఒకవేళ భారత్ లో అప్పటికి కరోనా పరిస్థితులు సద్దుమణగకపోతే ప్రథమ ప్రాధాన్యతగా ఇంగ్లండ్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించాలన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది. ఎందుకంటే, వచ్చే నెలలో న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జరిగేది ఇంగ్లండ్ లోనే. ఆ మ్యాచ్ తర్వాత టీమిండియా... ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్ లో ఆడతుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపైనే ఐపీఎల్ రెండో భాగం జరపాలని భారత క్రికెట్ పెద్దలు ప్రతిపాదిస్తున్నారు. ఇంగ్లండ్ లో అయితే విదేశీ ఆటగాళ్లకు కూడా పెద్దగా ఇబ్బందులేవీ ఉండవన్నది బోర్డు వర్గాల ఆలోచన.

కాగా, మరో ఆలోచన కూడా బీసీసీఐ ప్రతిపాదనలో ఉంది. గతేడాది ఐపీఎల్ ను కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించగా, బయో బబుల్ అత్యంత సమర్థవంతంగా అమలు చేసి టోర్నీని సజావుగా పూర్తి చేశారు. అందుకే ఈసారి కూడా యూఏఈలో జరిపే అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. ఒకవేళ యూఏఈలో సాధ్యం కాకపోతే ఆస్ట్రేలియాలోనైనా నిర్వహించాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News