Dhulipala Narendra Kumar: బెయిల్ పిటిషన్ పై విచారణ... ధూళిపాళ్ల కస్టడీ పొడిగించేది లేదన్న ఏసీబీ కోర్టు
- సంగం డెయిరీ కేసులో ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ల
- బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్
- నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం
- రేపటితో ముగియనున్న ధూళిపాళ్ల కస్టడీ
- ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న ధూళిపాళ్ల
సంగం డెయిరీ కేసులో బెయిల్ కోరుతూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ధూళిపాళ్ల తరఫున అడ్వొకేట్ గొట్టిపాటి రామకృష్ణ వాదనలు వినిపించారు. నరేంద్ర ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కరోనా బారినపడిన ధూళిపాళ్ల నరేంద్రకు విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అటు, ఏసీబీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ధూళిపాళ్ల కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ధూళిపాళ్ల కస్టడీ రేపటితో ముగియనుందని, ఆయన విచారణ ఇంకా పూర్తికాలేదని అన్నారు. అందుకే మరో వారం రోజులు కస్టడీ పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, ధూళిపాళ్ల కస్టడీని పొడిగించే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. అనంతరం, బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.