KCR: కొవిడ్ ను గెలిచిన అనంతరం తొలిసారి ప్రగతి భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్
- గత నెల 19న కేసీఆర్ కు కరోనా పాజిటివ్
- ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఐసోలేషన్
- రెండు వారాల పాటు అక్కడే చికిత్స
- ఈ నెల 4 నాటికి కోలుకున్న కేసీఆర్
కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విరామం అనంతరం హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గత నెల 19న సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స పొందారు. ఈ నెల 4 నాటికి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు కొవిడ్ నెగెటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో, పాలనాపరమైన కార్యక్రమాల కోసం ప్రగతి భవన్ కు విచ్చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. సీఎస్ సోమేశ్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈటలకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు కరోనా చర్యలపై గట్టిగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.