Corona Virus: కరోనా పేషెంట్‌తో కర్ణాటక విధానసభ ముందుకు.. ఎట్టకేలకు ఆసుపత్రిలో చోటు!
- దేశంలో దీనపరిస్థితులకు అద్దం పడుతున్న సంఘటన
- బెడ్ కోసం అనేక ఆసుపత్రులు తిరిగిన బాధిత కుటుంబం
- చేసేది లేక అంబులెన్సులో పేషెంట్‌తో పాటే విధానసభకు
- అడ్డుకున్న పోలీసులు.. బాధితుల నిరసన
- స్పందించి బెడ్ ఇప్పించిన సీఎస్
కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ ఉదంతం దేశంలో కరోనా ఉద్ధృతికి, తద్వారా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలపై ఒత్తిడికి అద్దం పడుతోంది. ఓ వ్యక్తికి కరోనా సోకగా.. ఎక్కడ తిరిగినా ఆసుపత్రుల్లో బెడ్ దొరకలేదు. దీంతో బాధిత కుటుంబం చేసేది లేక కొవిడ్ బాధితుణ్ణి అంబులెన్సులో తీసుకొని విధానసభ ముందుకు చేరారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విధాన సభ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఓ కాంగ్రెస్ నాయకుడు అక్కడికి చేరుకొని వారితో పాటు నిరసనలో పాల్గొన్నారు.
దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ వెంటనే బాధితునికి ఆసుపత్రిలో బెడ్ దొరికేలా చర్యలు చేపట్టారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న తొలి 10 రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఉండడం గమనార్హం.