Telangana: తెలంగాణలో మూడు రోజులపాటు వానలు.. నేడు వడగళ్ల వర్షం!
- ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం
- అక్కడి నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి
- జూన్ 9న తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
తెలంగాణలో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, నేడు ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉదని వివరించింది.
మరోవైపు, జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 9వ తేదీ నాటికి తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, తెలంగాణలో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.