Andhra Pradesh: పల్నాడు ఆసుపత్రిలో ఆరు రోజుల చికిత్సకు రూ. 3.15 లక్షలు.. కొరడా ఝళిపించిన ప్రభుత్వం!

AP Govt files Criminal Cases against private hospitals

  • గత రెండు రోజులుగా ఆసుపత్రులపై అధికారుల దాడులు
  • రూ. 2,200కు సరఫరా చేసిన రెమ్‌డెసివిర్‌ రూ.10వేలకు విక్రయం
  • అనుమతి లేకున్నా కొవిడ్ చికిత్స
  • ఆరోగ్యశ్రీ కింద చికిత్స నిరాకరణ

కరోనా రోగులను నిలువునా దోచుకుంటున్న ఆసుపత్రులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ, వైద్యారోగ్యశాఖాధికారులతో కూడిన బృందం ఆరు ఆసుపత్రుల్లో అక్రమాలను గుర్తించింది.

అనుమతి లేకున్నా కరోనాకు చికిత్స చేయడం, ఆరోగ్య శ్రీ కింద చికిత్స నిరాకరించడం, రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడాన్ని గుర్తించిన బృందం ఎక్కడికక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని పల్నాడు ఆసుపత్రిలో ఓ రోగి నుంచి ఆరు రోజుల చికిత్సకు ఏకంగా రూ. 3.15 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. అలాగే, అంజిరెడ్డి ఆసుపత్రులలో ఒక రోగి నుంచి నాన్ క్రిటికల్ చికిత్స కోసం రూ. 1.50 లక్షలు వసూలు చేసినట్టు తేలడంతో ఆయా ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్టు గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పల్లె జాషువ తెలిపారు. రూ. 2,200కు సరఫరా చేసిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను పల్నాడు ఆసుపత్రి రూ. 10 వేలకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు.

  • Loading...

More Telugu News