Chiranjeevi: ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం: చిరంజీవి
- గాయకుడు జి.ఆనంద్ మృతి పట్ల విచారం
- నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్రదానం చేశారు
- నాలో ఒక భాగమైన మృదు స్వభావి
- ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను
ప్రముఖ సినీ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఎన్నియల్లో.. ఎన్నియల్లో... ఎందాకా.. అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్రదానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి శ్రీ జి.ఆనంద్ గారు కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
'మొట్టమొదటి సారి వెండి తెరమీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పరచింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.