Mohan Ji: ప్రముఖ సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ జీ మృతి
- మోహన్ జీ వయసు 86 సంవత్సరాలు
- సోదరుడితో కలసి 'మోహన్ జీ-జగన్ జీ'గా ప్రస్థానం
- 900కు పైగా చిత్రాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పని చేసిన వైనం
- మోహన్ జీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు
తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ జీ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1935లో ఆయన గుంటూరులో జన్మించారు. ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో స్టిల్ ఫొటోగ్రాఫర్ గా మారారు. తొలుత ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న తర్వాత, తన సోదరుడితో కలిసి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా మారారు. 'మోహన్ జీ-జగన్ జీ' పేరుతో సినీ రంగంలో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
తన తొలి చిత్రాన్ని దివంగత ఎన్టీఆర్ తో మోహన్ జీ చేయడం గమనార్హం. ఎన్టీఆర్ నటించిన 'కాడెద్దులు ఎకరం నేల' చిత్రంతో వీరి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 900 చిత్రాలకు వీరు స్టిల్ ఫొటోగ్రాఫర్స్ గా వ్యవహరించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాలకు కూడా వీరు పని చేశారు. మరోవైపు జగన్ జీ చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. మోహన్ జీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.