GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో జ్వరం సర్వేను నిర్వహిస్తున్న అధికారులు
- సర్వేను నిర్వహిస్తున్న 700 బృందాలు
- ఇప్పటి వరకు 47,582 ఇళ్లలో సర్వేలు
- ఆయా ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావకం పిచికారీ
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటా ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 47,582 ఇళ్లలో సర్వేను నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖకు చెందిన 700 బృందాలు ఇంటింటికి తిరిగి సర్వేను నిర్వహిస్తున్నాయని చెప్పారు.
సర్వేలో భాగంగా జ్వరంతో ఉన్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జ్వరం ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు... జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు. దీంతోపాటు, కోవిడ్ అవుట్ పేషెంట్లకు రెగ్యులర్ గా పరీక్షలను నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ద్వారా 130 మందికి కోవిడ్ సంబంధిత సలహాలు, సూచనలను వైద్యులు చేశారని అధికారులు తెలిపారు.